19, సెప్టెంబర్ 2017, మంగళవారం

మనిషీ - పద్యమూ




నడత మనిషికి అందం
నడక కవితకి అందం

అవయవాలు మనిషికి ఆకృతి నిస్తాయి
అక్షరాలు పద్యాలకు ఆకృతి నిస్తాయి

జీవకళ అన్నది జీవిలో  చైతన్యానికి సూచిక
అది లేని మనిషి ఒక తోలు బొమ్మ మాత్రమే

రసావిష్కరణ అన్నది పద్యానికి జీవసూచిక
అది లేని పద్యం ఒక  అక్షరాల దండ మాత్రమే

పది నిముషాల కోసం మనిషి పుట్టడు
అలా పుట్టినవాడు సాధించేది శూన్యం

పదిక్షణాల తమాషా కోసం పద్యం పుట్టదు
అలా పుట్టిన పద్యం ప్రయోజనం శూన్యం

మనిషి పుట్టినా ఒక ప్రయోజనం ఉండాలి
పద్యం పుట్టినా ఒక  ప్రయోజనం ఉండాలి.

పుట్టింది దేనికో తెలిసిన వాడు ఋషి
పద్యాన్ని తెలిసి రాసే వాడు ఋషి



18, సెప్టెంబర్ 2017, సోమవారం

నచికేతుడు - 4



1. ఆనందము స్వల్పము
దుఃఖమే యధికము
మానవుల జీవితము
ఓ యమరాజా

2.  స్వర్గమని యున్నదట
 జరయనే దుండదట
మృత్యువచట లేదట
ఎంత గొప్పదో

3. స్వర్గమని యున్నదట
ఆకలియట లేదట
దప్పికయు లేదట
ఎంత గొప్పదో

4. స్వర్గమని యున్నదట
భయమనే దుండదట
పరమసుఖాస్పదమట
ఎంత గొప్పదో

5. అమృతత్వము నొసగెడు
స్వర్గదమై వెలిగెడు
అగ్నివిద్య నెఱుగును
సమవర్తి యందురు

6. శ్రధ్ధగ నా విద్యను
నీ వలన నేర్వగను
కేల్మోడ్చి కోరెదను
నా కిమ్మీ వరము

7. ఈ రెండవ వరమును
దయచేయ వేడెదను
ఆనందధామమును
పొందు విధమును

8. దయతో‌ నెఱిగింపవే
నా కనుగ్రహింపవే
సకలతత్త్వ విదుడవే
ఓ యమదేవా

9.  అడిగెను నచికేతుడు
శ్రధ్ధాళువు బాలుడు
సంత సించెను యముడు
తలయూచినాడు


12, సెప్టెంబర్ 2017, మంగళవారం

నచికేతుడు - 3



1.అంతట నచికేతుడు
పరమ బుధ్ధిమంతుడు
యమునిపట్ల ప్రీతుడు
కోరదొడగి నాడు

2. పొరబడి నాతండ్రిని
నేను తప్పెంచితిని
వారి కోపవహ్నిని
చల్లబరచవే

3. ఇదే మొదటి వరముగ
ఒసగవే శీఘ్రముగ
నా వేదన తొలగగ
ఓ యమదేవా

4. మరల నన్ను చూడగ
ఆనందము నిండగ
నా తండ్రికి మెండుగ
ఓ‌ యమదేవా

5.  నీ వనుగ్రహింపుము
నాకు మేలు కూర్చుము
లేదు నీ‌ కసాధ్యము
ఓ‌ యమదేవా

6. అనియెను నచికేతుడు
పరమ బుధ్ధిమంతుడు
కడు మెచ్చెను యముడు
తల యూచినాడు

7.  మెచ్చ దగిన కోరిక
కోరితి విదె బాలక
నీకు సాటి లేరిక
ఓ నచికేతా

8. తొలగ గలదు కోపము
తొలగ గలదు తాపము
కలుగ గలదు శాంతము
ఓ‌నచికేతా

9.  నిన్ను గాంచి జనకుడు
కడుగడు సంతసపడు
స్వీకరించ త్వరపడు
ఓ‌ నచికేతా


8, సెప్టెంబర్ 2017, శుక్రవారం

నచికేతుడు - 2


1. తత్త్వవిదుడు  ధీరుడు
బాలుడు నచికేతుడు
వచ్చినపుడు కాలుడు
పురము నందు లేడు

2. నచికేతుడు వేచెను
మూడు నాళ్ళు గడచెను
యముడు తిరిగివచ్చెను
నిజపురము చొచ్చెను

3. అతిథి  అగ్నిదేవుడు
పరమపూజనీయుడు
యమరాజా త్వరపడు
అని రంతేవాసులు

4. పూజనీయుడ వీవు
అతిధివై వచ్చావు
ఉపవాస మున్నావు
ఓ నచికేతా

5. అతిధి యాకలి గొన్న
గృహమేథి ఖలుడన్న
వాని సిరి చెడునన్న
ఓ నచికేతా

6. నీ యీ యుపవాసము
నా దగు నపరాథము
నీవు క్షమియించుము
ఓ నచికేతా

7. గడచె మూడు రాత్రములు
కాన నిత్తు శుభములు
నీకు మూడు వరములు
ఓ నచికేతా

5, సెప్టెంబర్ 2017, మంగళవారం

నచికేతుడు -1


1. మహర్షి వాజవశ్రుని
సుతుడగు నచికేతుని
గూర్చి ఒక్క చక్కని
కథ వినరండి

2. యజ్ఞదీక్షితుడైన
తండ్రికి ఘాటైన
ప్రశ్నను చురుకైన
కొడుకు వేసినాడు

3. దాన మంటున్నావు
వట్టిపోయిన ఆవు
లెందు కిస్తున్నావు
తప్పెంచకుండ

4. ఈ రీతి ప్రశ్నించ
తండ్రి యుపేక్షించ
అవేశ మగ్గించ
ప్రశ్నించె కొడుకు

5. ఉన్నవన్నీ‌ నీవు
దాన మిస్తున్నావు
నన్నెవరి కిస్తావు
దయచేసి చెప్పు

6. మూడు మారు లిట్లని
తనయు డడిగి నాడని
కోపగించి యాముని
నోరు జారెను

7. ధర్మవ్యగ్రా విను
ధర్మదేవునకు నిను
దానముగ నిచ్చెదను
నీవు పోవచ్చును

8. విని కొడు కిటు పలికెను
కాను మొదటి వాడను
కాను చివరి వాడను
భయమేల పోదును

9. కొంచె మెంచి చూడుము
యమున కేమి లాభము
వీడుమా విచారము
భయమేల పోదును

10. దేహధారు లందరు
వచ్చిపోవు చుందురు
విదు లిందుకు కుందరు
ధీరచిత్తు లగుచు


2, సెప్టెంబర్ 2017, శనివారం

హద్దుమీరిన తెంపరితనం - తప్పు సవరించుకో నొల్లని డాంబికం.


పాఠకులారా,  వరూధిని బ్లాగులో, జిలేబీ గారు వ్రాసుకొన్న ఈ గిద్యం కొద్ది సేపటి క్రిందట నా కళ్ళ బడింది మాలిక వ్యాఖ్యల పుటలో.

శ్రీ కూనలమ్మ కలమున్
తాగైకొని కవనవీర తారా పథమున్
జోగితిరుగుల జిలేబీ
మా గాయల వేయుచు కసమస వచ్చె గదా !

ఇదొక కందపద్యం‌ అనీ 'క' కు 'గ' తో‌ ప్రాసమైత్రి ఉందని జిలేబీ గారి ఛందోవివేకం. బాగుంది.

అందరికీ తెలిసిన సంగతే. జిలేబీగారి పద్యాల్లో అర్థం వెదకటం ఎండమావుల్లో నీళ్ళు వెదకటం కన్నా పెద్ద వ్యర్థక్రియ.  అందుచేత పై వ్రాతకు పూర్తి అన్వయం ఏమిటో ఆవిడకే తెలియాలి.

కాని ఇక్కడ కూనలమ్మకు అసహ్యం‌ కలిగించిన విషయం ఏమిటంటే 'కూనలమ్మ కలమున్ తాగైకొని ' అంటూ‌ జిలేబీ గారు డప్పువేసుకోవటం.

ఒక ముఖ్య విషయం. కూనలమ్మ అన్న పేరుతో ఈ కూనలమ్మ బ్లాగు నిర్వహిస్తున్నది జిలేబీ కాదన్నది ఇప్పటికే బ్లాగులు చదివేవారికి బాగానే తెలిసి ఉంటుందని నమ్ముతున్నాను.

సందేహం ఉన్న వారు కూనలమ్మ పద్యాలు కొన్ని వెలువడిన పిదపనే కూనలమ్మ బ్లాగు మెదలయిందన్న విషయం‌ గుర్తుకు తెచ్చుకుంటే, ఈ కూనలమ్మ ఎవరో‌ బోధపడుతుంది.

ఇప్పుడు, ఇకొంకరి డాంబికం గురించి కూడా వ్రాయక తప్పటం‌ లేదు.  గత నెల 30వ తారీఖున కూనలమ్మ అన్నసూక్తం‌ అన్న టపా ఒకటి ప్రచురించాను. అది నచ్చి అన్యగామి గారు 'జిలేబి గారు, మీ పద్యాల పదును పెరుగుతోంది. అన్నం పరబ్రహ్మ స్వరూపమని బాగా చెప్పారు.' అంటూ ఒక వ్యాఖ్య పెట్టారు.  అన్యగామి గారు పొరబడ్డారు. ఆ సంగతిని వారే‌ త్వరలో గుర్తించ గలరని భావించి పట్టించుకోలేదు.  మరొక టపాలో‌ సూచనగా వారు పొరబడిన సంగతిని ప్రస్తావించాను.  కాని ఈనెల ఒకటవ తారీఖున 'పొరబడ్డారు. జిలేబీ వేరు, కూనలమ్మ వేరు.' అని స్పష్టంగా తెలియ జేయటం జరిగింది.

కాని ఇంతవరకూ అన్యగామి గారి వద్దనుండి ఒక్క ముక్క కూడా పొరపాటును సవరించుకొనే ప్రయత్నంగా రాలేదు. అలాగని వారు ఈ‌మధ్యకాలంలో బ్లాగుల్లో కనిపించలేదా అంటే అదేమీ‌ లేదు - కనిపిస్తునే ఉన్నారు. అంటే‌ దాని అర్థం వారికి పొరపాటును ఒప్పుకొనే హుందాతనం లేదనే కదా. ఒకవేళ అన్యగామి గారు ఆ టపా వ్రాసినది జిలేబీ కాదని తెలిస్తే మెచ్చుకోలు తెలిపేవారు కాదేమో. అనవసరంగా మెచ్చుకున్నానే అనుకుంటున్నారేమో‌ తెలియదు. అందుకనే మౌనంగా ఉండిపోయారేమో తెలియదు.

ఒక అవకాశం దొరికింది కదా అని,  ఈ‌ ప్రక్కన జిలేబీ‌గారు అక్షరాలా కూనలమ్మ పేరును కబ్జా చేసేందుకు నానా గోలా చేస్తున్నారు.  పైగా కూనలమ్మ బ్లాగు లోనే మరొక వ్యాఖ్యలో  జిలేబీ గారు 'కూ సింతై న సిగ్గు వలయున్ గదుటే ' అంటూ‌ కూనలమ్మ నే గద్దించారు!

ఇదంతా చాలా అసహ్యం కలిగిస్తోంది. దాని మాటల్లోనికి తేవటమూ‌ కష్టమే అనిపిస్తోంది. పాఠకులు అర్థం చేసుకోవలసినదే.

జిలేబీ లాంటి తెంపరులను శిక్షించటం ఎలాగూ‌ అన్నది అటుంచి ఉచితానుచితాలను ఉద్దేశపూర్వకంగా విసర్జించిన వారినుండి తమతమ బ్లాగుల యొక్క హుందాతనాన్ని కాపాడుకోవటం ఎట్లాగూ‌ అన్నది ముఖ్యమైన ప్రశ్న.

ఇకపై ఎంపిక చేసిన వ్యాఖ్యలనే ఈ  కూనలమ్మ బ్లాగు లో  ప్రచురించటం జరుగుతుంది. నియంత్రణ లేదు కదా అని కాలక్షేపరాయుళ్ళూ, కాకిగోల జిలేబీలూ, అనామకులూ ఇకపై ఇక్కడ గిలకటం కుదరదు. ఈ నిర్ణయం‌ వెంటనే అమలులోనికి వస్తున్నది.

ఇక్కడ గిలకటం కుదరని వాళ్ళెవరైనా ఎక్కడెక్కడో ఎదోదో‌ గొణుక్కుంటే కూనలమ్మ పట్టించుకోదు. అంత తీరికా ఓపికా కూనలమ్మకు లేవు.

పాఠకులు సహకరించ ప్రార్థన.

1, సెప్టెంబర్ 2017, శుక్రవారం

నీ దారి నీదిగా సాగు నిర్భీతిగా ఓ కూనలమ్మా


అందాల కందాలు
చెడగొట్టు చందాలు
జిలేబీ గిందాలు
ఓ కూనలమ్మా

హాస్యాలతో‌ తప్పు
కప్పి ఒప్పని చెప్పు
జిలేబీతో ముప్పు
ఓ కూనలమ్మా

జిలేబీతో చర్చ
చేయుటే ఒకపిచ్చ
ఎందుకొచ్చిన రచ్చ
ఓ‌ కూనలమ్మా

అలవాటు ఒకరిదా
పొరపాటు ఒకరిదా
గ్రహపాటు ఒకరిదా
ఓ కూనలమ్మా

నీ‌ మాట నీదిగా
నీ దారి నీదిగా
సాగు నిర్భీతిగా
ఓ కూనలమ్మా